భూముల రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్
జడ్చర్ల, అక్టోబర్ 14: జడ్చర్ల మండలం ఖానాపూర్ గ్రామంలో కొనసాగుతున్న రీ సర్వే పనులను మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్(రెవెన్యూ) హరిప్రియ(Additional Collector Haripriya) పరిశీలించారు. గ్రామంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు ప్రత్యేక బృందాలతో చేపడుతున్న రీ సర్వే పనులను ఆమె పరిశీలించారు. ఈ పరిశీలనలో జడ్చర్ల తహసీల్దార్, నర్సింగ్ రావు డిప్యూటీ తహసీల్దార్ పాల్గొన్నారు.
పనుల పురోగతిని సమీక్షించిన అదనపు కలెక్టర్, కొత్తగా ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చిన రెండు రీ సర్వే బృందాల సేవలను సమర్ధవంతంగా వినియోగించుకుని పనులను వేగవంతం చేయాలని అధికారులను,మండల సర్వేయర్ ను ఆదేశించారు.రీ సర్వే పనుల పురోగతిని జిల్లా యంత్రాంగం రోజువారీగా పర్యవేక్షిస్తోందని తెలిపారు.
అనంతరం గ్రామస్తులు, రైతులతో మాట్లాడిన ఆమె, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో రీ సర్వే కార్యక్రమం అమలు చేస్తున్నట్లు వివరించారు. కచ్చితమైన భూ కొలతలు, సరిహద్దుల నిర్ధారణ కోసం ఆధునిక రోవర్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. రీ సర్వే పూర్తయిన తర్వాత సంబంధిత భూ యజమానులకు ల్యాండ్ పార్సిల్ మ్యాప్స్ (LPM) అందజేస్తామని,
దీని ద్వారా భవిష్యత్తులో భూ సరిహద్దులు, రెవెన్యూ రికార్డులకు సంబంధించిన వివాదాలను నివారించవచ్చని వివరించారు. రీ సర్వే కార్యక్రమం సజావుగా, వేగంగా, సకాలంలో పూర్తయ్యేందుకు గ్రామస్తులు, రైతులు అధికారులకు పూర్తి సహకారం అందించాలని అదనపు కలెక్టర్ హరి ప్రియ విజ్ఞప్తి చేశారు.