4 నెలలుగా నో శాలరీ..
ఆస్పత్రి ఎదుట బతుకమ్మ ఆడుతూ కాంట్రాక్ట్ సిబ్బంది వినూత్న నిరసన!
జడ్చర్ల, అక్టోబర్ 14: జడ్చర్ల పట్టణంలో నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు ఉద్యోగులు(Government hospital contract employees) వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆసుపత్రి ముందే బతుకమ్మ ఆడుతూ తాము పడుతున్న బాధలను బతుకమ్మ పాట రూపంలో పాడుతూ తమ ఆవేదనను వెళ్లగక్కారు.
అందరూ పండగలు చేసుకుంటుంటే తాము తమ పిల్లలు మాత్రం మోకాలు చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగ వచ్చినా చేతిలో డబ్బులు లేక పండగ చేసుకోలేని దుస్థితిలో ఉన్నామని వాపోయారు. ఇదే విషయంపై ఆసుపత్రి సూపర్డెంట్ను అడగగా మీ కాంట్రాక్టర్ను అడిగి జీతాలు తీసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిసారి కార్మికుల జీతాల కొరకు ఆందోళన చేస్తే తప్ప తమ జీతాలు సగం సగం చెల్లింపులు చేస్తారని కార్మికులు ఆరోపించారు. నిరుపేద కుటుంబాలైన తమకు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, అప్పులు చేసి బతకాల్సి వస్తోందని కార్మికులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.