బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి

20-11-2026 | 09:07pm

విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం సమాజ బాధ్యత: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్

టేకులపల్లి: బాల్య వివాహాలు బాలల భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయని, వాటి నిర్మూలనకు గ్రామస్థులు, యువత, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(District Legal Services Authority) కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం. రాజేందర్ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం టేకులపల్లి మండలం తడకలపూడి గ్రామ పంచాయతీలో బాల్య వివాహాల నిర్మూలన(Child Marriage Eradication Program)పై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల బాలల ఆరోగ్యం, విద్య, మానసిక వికాసంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.

పాఠశాల విద్య మధ్యలోనే మానేసి గంజాయి, మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్న విద్యార్థులపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోక్సో చట్టం ప్రాధాన్యతను వివరిస్తూ, బాలలపై లైంగిక నేరాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బడిమానేసిన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని, అవసరమైన వారికి సీడబ్ల్యూసీ, డీడబ్ల్యూఓ అధికారుల సమన్వయంతో వసతి గృహాల్లో ప్రవేశం కల్పించి విద్యను కొనసాగించేలా చూడాలని సూచించారు.

అనంతరం గ్రామ పంచాయతీ నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వరకు బాల్య వివాహాల నిర్మూలన నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యుడు అంబేద్కర్, టేకులపల్లి ఎస్‌ఐ తిరుపతి, గ్రామ పెద్ద బుచ్చిరాములు, ఉపసర్పంచ్ వాసం సీత, అంగన్వాడీ సూపర్‌వైజర్ బి. నిర్మల, గ్రామ కార్యదర్శి దీప్తి, 1098 హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్ లలిత, పారా లీగల్ వాలంటీర్లు చరణ్ కుమార్, బి. భారతి, పి. రాజకుమారి, డ్వాక్రా ప్రతినిధి రత్నకుమారి, ఏఐడీ ఎన్జీవో ప్రతినిధి మాన్‌సింగ్, అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు, యువత, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు