శంకుస్థాపనకే పరిమితమైన సైడ్ డ్రెయిన్ పనులు!
నాలుగేళ్లుగా ముందుకు సాగని నిర్మాణం..
మురుగునీరు, దోమలతో ప్రజల అవస్థలు
అశ్వాపురం, నవంబర్ 20 (విజయక్రాంతి): మండల పరిధిలోని మొండికుంట గ్రామంలో(Mondikunta Village) ఆర్అండ్బీ రహదారికి(R&B Road) ఇరువైపులా సైడ్ డ్రెయిన్ల నిర్మాణం(Construction of side drains) కోసం శంకుస్థాపన చేసి నాలుగేళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభానికి నోచుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.151 లక్షల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన ఈ నిర్మాణ పనులకు 2022 డిసెంబర్ 5న శంకుస్థాపన చేసినప్పటికీ, నేటికీ ఎలాంటి పురోగతి లేకపోవడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడమే తప్ప, వాటిని ఆచరణలోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సైడ్ డ్రెయిన్లు లేకపోవడంతో మురుగునీరు రోడ్డు పక్కనే నిలిచిపోతుండగా, సాయంత్రం వేళల్లో దోమల బెడద విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా రోడ్డుపక్కన వ్యాపారాలు నిర్వహించే వ్యాపారస్తులు, అటుగా రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దోమల కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ పనులపై సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి, జాప్యానికి గల కారణాలను వెల్లడించడంతో పాటు నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యం, వ్యాపారస్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే పనులు ప్రారంభించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
శంకుస్థాపనలకే అభివృద్ధి పరిమితం కాకుండా, పనులు పూర్తిచేసి ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి సైడ్ డ్రెయిన్ల నిర్మాణానికి చర్యలు చేపడతారా? లేక ఈ శిలాఫలకం మరో అభివృద్ధి హామీగానే మిగిలిపోతుందా? అన్నది వేచి చూడాల్సిందే.