అనురాగ్ లో జాతీయ ఫార్మసీ వారోత్సవాలు–2026 నిర్వహణ
ఘాట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ(Anurag University's School of Pharmacy) ఆధ్వర్యంలో జాతీయ ఫార్మసీ వారోత్సవాలను(National Pharmacy Week) శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థుల్లో ఔషధ విజ్ఞానం, పరిశోధనా నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేలా పలు విద్యా, ఆరోగ్య, విజ్ఞానపరమైన కార్యక్రమాలను నిర్వహించారు. ఈకార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సైటెక్ పేటెంట్ అసిస్టెన్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(Scitech Patent Assistance Services Private Limited) అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మీశాంతి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె ఫార్మసీ రంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనల ప్రాధాన్యత, విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. స్కూల్ ఆఫ్ ఫార్మసీ డీన్ డాక్టర్ వసుధ భక్షి మాట్లాడుతూ ఫార్మసీ విద్య అనేది కేవలం ఔషధాల అధ్యయనానికే పరిమితం కాకుండా ఆరోగ్య సంరక్షణ, సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు తమ పరిశోధనా ఆలోచనలు, సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతిబింబించేలా వివిధ ప్రాజెక్ట్, ప్రోటోటైప్ ప్రదర్శనలు నిర్వహించారు. అదేవిధంగా నీలిమ హాస్పిటల్ సహకారంతో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు. విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించేలా వివిధ క్విజ్ పోటీలను కూడా నిర్వహించారు.