ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

20-11-2026 | 09:36pm

జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య డిమాండ్

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం సంఘం జిల్లా అధ్యక్షులు గౌరీ నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురిచేసిందని ఆయన అన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పరిస్థితులు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా సమగ్ర విచారించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు‌. భద్రాచలం ఏజెన్సీ ఆదివాసీల ప్రాంతం.ఇక్కడే ఆదివాసీ యువకులకు భద్రత లేకపోతే సామాన్య ఆదివాసీల పరిస్థితి ఏమిటని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను,పోలీస్ శాఖను ఆయన ప్రశ్నించారు.

ఆదివాసీ యువకుడి మృతి వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి రావాలని అన్నారు. బాధ్యులెవరైనా సరే, వారి స్థాయి, పలుకుబడితో సంబంధం లేకుండా చట్టం ముందు నిలబెట్టాలని ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ షెడ్యూల్ సున్నం గంగా, సోయం జోగారావు, మడివి రమేష్, సోడెం ప్రసాద్, కుంజ శ్రీను, కుంజా రామ్మూర్తి, పోడియం వెంకటేశ్వర్లు, రాఘవయ్య, ఇంకా తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు