పచ్చ కాంగ్రెస్‌లో వెచ్చగా ఉంటూ విమర్శలా.. ఖబడ్దార్ పున్నా!
మరోసారి రాజగోపాల్‌రెడ్డిపై మాట్లాడితే ఊరుకునేది లేదు
క్యాంపు కార్యాలయంలో కైలాష్ నేత ఫొటో తొలగించాలి
ముఖ్యమంత్రి కూడా మూడు పార్టీలు మారలేదా.. ఆయనపై వ్యాఖ్యలు చేయొచ్చా?
మునుగోడు అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పోరాటం
పున్న కైలాష్ నేతకు కాంగ్రెస్ మండల అధ్యక్షుల హెచ్చరిక
మునుగోడు,(విజయక్రాంతి): ఇన్నాళ్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopal Reddy) అండతో రాజకీయంగా ఎదిగి, ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేయడం ఏమిటని కాంగ్రెస్ నాయకులు డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత(DCC President Punna Kailash Netha)ను ప్రశ్నించారు. పచ్చ (తెలుగుదేశం) కాంగ్రెస్‌లో వెచ్చగా ఉంటూ తమ నాయకుడిపై విమర్శలు చేస్తే సహించేది లేదని, మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు.
రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నదే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆశయమని, అందులో భాగంగానే భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం సొంత నిధులు ఖర్చు చేసి కృషి చేశారని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే మండల అధ్యక్ష పదవులు కట్టబెట్టారని, బీజేపీకి వెళ్లిన వారికి పదవులు ఇచ్చారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం మూడు పార్టీలు మారిన విషయాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ ప్రయాణాల గురించి మాట్లాడేటప్పుడు అందరికీ ఒకే ప్రమాణం ఉండాలని వ్యాఖ్యానించారు.నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడగడం పార్టీ వ్యతిరేక చర్య ఎలా అవుతుందని ప్రశ్నించారు.
ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదువుతూ ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ నిధులు రాకున్నా ఎమ్మెల్యే సొంత నిధులతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. మునుగోడుకు నిధులు కేటాయించకపోవడంతోనే ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఎదురించి కాంగ్రెస్ పార్టీ కోసం రాజగోపాల్‌రెడ్డి పోరాడారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాజగోపాల్‌రెడ్డి చేసిన కృషిని విస్మరించరాదన్నారు. మునుగోడు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చేస్తున్న పోరాటానికి తామంతా అండగా ఉంటామని స్పష్టం చేశారు.
మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పున్న కైలాష్ నేత ఫొటోను తక్షణమే తొలగించాలని, ఆయనను డీసీసీ అధ్యక్షుడిగా గుర్తించవద్దని నాయకులు డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. ఈ సమావేశంలో భీమనపల్లి సైదులు, బోయ దేవేందర్, రాందాస్ శ్రీనివాస్, పల్లె వెంకన్నగౌడ్, వెన్నంనేని రవీందర్‌రావు, బుజ్జి, మిర్యాల వెంకన్న, పూల వెంకటయ్య, జాల వెంకటేశ్వర్లు, మక్కెన అప్పారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.