విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలి..

07-10-2026 | 06:39pm

పరీక్షల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలి.

విద్యార్థులకు నాణ్యమైన,పరిశుభ్రమైన ఆహారం అందించాలి.

జిల్లా కలెక్టర్ అంకిత్..

ములకలపల్లి, అక్టోబర్ 7 (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులతో పాటు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్(Collector Ankit) ఏకలవ్య సిబ్బందిని ఆదేశించారు. ములకలపల్లి మండలం మూకమామిడి ఏకలవ్య పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించిన కలెక్టర్ పాఠశాలలోని ప్రతి తరగతి గదిని సందర్శించి అక్కడ జరుగుతున్న పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.

విద్యార్థులు రాస్తున్న పరీక్షలను గమనించి వారి ప్రశ్నపత్రాలు,ఆన్సర్ షీట్లను పరిశీలించారు.పరీక్షల నిర్వహణలో పాటిస్తున్న విధానం, విద్యార్థుల హాజరు, పరీక్షల సమయంలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, ప్రధానోపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఏకలవ్య పాఠశాలలకు ఒకే ప్రశ్నపత్రాన్ని రూపొందించి పంపిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు కలెక్టర్‌కు వివరించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమైన మందులు, ప్రాథమిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాల కిచెన్ షెడ్‌ను పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు.వంటకు వినియోగిస్తున్న కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు.

కూరగాయలను నేలపై ఉంచడాన్ని గమనించిన కలెక్టర్, కూరగాయలను నేలపై ఉంచడం వల్ల పురుగులు, క్రిమికీటకాలు చేరి ఆహారం కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు.కూరగాయలను ర్యాకులు, బండలపై సురక్షితంగా నిల్వ చేయాలని ఆదేశించారు.స్టోర్ రూమ్‌ను పరిశీలించి ఆహార పదార్థాలు,ఇతర సామగ్రిని క్రమబద్ధంగా నిల్వ చేయాలని ఆదేశించారు.ధాన్యాలు, పప్పులు, కూరగాయలు తదితర వస్తువులను నేలపై ఉంచకుండా ర్యాకులు,బండలపై భద్రపరచాలని,అవసరమైన ఆహార పదార్థాలను మూత ఉన్న డబ్బాలు,కంటైనర్లలో నిల్వ చేయాలని సూచించారు.

వంటశాల, స్టోర్ రూమ్‌తో పాటు పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ రోజు మెనూలో భాగంగా విద్యార్థులకు తయారు చేస్తున్న చికెన్ కూర నాణ్యతను కూడా కలెక్టర్ పరిశీలించారు.చికెన్ ఎంత పరిమాణంలో వినియోగిస్తున్నారని, ఒక్కో విద్యార్థికి ఎంత పరిమాణంలో అందిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 80 కిలోల చికెన్‌ను వంటకు వినియోగిస్తున్నామని, ఒక్కో విద్యార్థికి సుమారు 120 గ్రాముల చొప్పున అందిస్తున్నామని సిబ్బంది కలెక్టర్‌కు తెలిపారు.వంట అనంతరం భోజన నాణ్యతను పరిశీలించి, విద్యార్థులకు సమయానికి,నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ములకలపల్లి తాసిల్దార్ స్వాతి బిందు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు