భువనగిరిలో విద్యుత్ వినియోగదారులకు గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫోరం!

07-10-2026 | 07:23pm
  1. విద్యుత్ సమస్యలపై ఆన్‌లైన్‌ లేదా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయొచ్చు..
  2. లో ఓల్టేజ్‌, మీటర్లు, బిల్లులు, కొత్త సర్వీసులు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలకు పరిష్కారం..
  3. వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కొడారి వెంకటేష్...

ఆలేరు, అక్టోబర్ 7 (విజయక్రాంతి): విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఎలక్ట్రిసిటీ కంజ్యూమర్ గ్రీవెన్సెస్ రెడ్రెసల్ ఫోరం(Electricity Consumer Grievances Redressal Forum) (CGRF) నిరంతరం అందుబాటులో ఉంటుందని సీజీఆర్‌ఎఫ్ చైర్‌పర్సన్ కే. సాయిబాబా తెలిపారు. విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను లిఖితపూర్వకంగా లేదా ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవాలని సూచించారు.

బుధవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని కిసాన్‌నగర్ విద్యుత్ కార్యాలయంలో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, మీటర్ల సమస్యలు, విద్యుత్ బిల్లుల వివాదాలు, కొత్త సర్వీసుల మంజూరు, మీటర్ పేరుమార్పు, కేటగిరీ మార్పు, ట్రాన్స్‌ఫార్మర్ సంబంధిత సమస్యలు తదితర అంశాలపై ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి:

జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను విద్యుత్ శాఖ అధికారులు సత్వరమే పరిష్కరించాలని వినియోగదారుల సంఘాల ప్రతినిధి కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. విద్యుత్ తీగల కింద హరితహారంలో భాగంగా మొక్కలు నాటకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రధానంగా లో ఓల్టేజ్ సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద రక్షణ కంచెల ఏర్పాటు, రైతులకు సక్రమంగా విద్యుత్ సరఫరా, గృహజ్యోతి పథకం అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫోరం సభ్యులకు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో CGRF మెంబర్ టెక్నికల్ వి. రమణమూర్తి, మెంబర్ ఫైనాన్స్ కే. శోభారాణి, కంజ్యూమర్ ఎఫైర్స్ మెంబర్ టి. కోటేశ్వరరావు, భువనగిరి, రామన్నపేట, బీబీనగర్, మోత్కూరు, ఆలేరు, చౌటుప్పల్ డివిజన్ల ఇంజనీర్లు రవీందర్, వెంకటేశ్వర్లు, సుధీర్‌కుమార్, పద్మ, శ్రీకాంత్, బాలూనాయక్, ఫీర్యా, మోహన్, పట్టణ ఏఈ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు