హన్మకొండలో ఘనంగా ‘సేవా జ్యోతి యాత్ర’ – ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’
ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ జాతీయ నాయకులు పి.మురళీధర్ రావు, డా. బూర నర్సయ్య గౌడ్.
హనుమకొండ, అక్టోబర్ 7 (విజయ క్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వాధినేతగా 25 ఏండ్ల నిరంతర ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి అధ్యక్షతన హన్మకొండలో ‘సేవా జ్యోతి యాత్ర – వికసిత భారత్ సంకల్ప సభ’ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ నాయకులు పి.మురళీధర్ రావు, హనుమకొండ జిల్లా ఇంచార్జ్, మాజీ ఎంపీ డా. బూర నర్సయ్య గౌడ్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నాయకురాలు రావు పద్మ రెడ్డి హాజరయ్యారు.హనుమకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద శాస్త్రోక్తంగా ‘సేవా జ్యోతి’ని ప్రతిష్ఠించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వేదికపై అమర్చిన ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ సందేశాన్ని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సామూహికంగా వీక్షించారు. అనంతరం 'వికసిత్ భారత్ @2047' లక్ష్య సాధన కోసం, దేశ నిర్మాణంలో భాగస్వామ్యమవుతామని వేలాది మంది కార్యకర్తలు, ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేసారు. సభ అనంతరం అంబేద్కర్ విగ్రహం నుండి అమరవీరుల స్థూపం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.