విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై కలెక్టర్ ఆరా

25-11-2026 | 11:45pm

వేపలగడ్డ గిరిజన సంక్షేమ మోడల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

బూర్గంపాడు, (విజయక్రాంతి): విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, బోధనా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit) వేపలగడ్డ గిరిజన సంక్షేమ మోడల్ పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను సందర్శించి విద్యార్థుల చదువు, రాత నైపుణ్యాలను స్వయంగా పరిశీలించారు.విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ ఇంగ్లీష్ పాఠ్యాంశాలను చదివించి వారి పఠన సామర్థ్యాన్ని పరీక్షించారు.

తెలుగు అక్షరాలు, వర్ణమాల రాయించడంతో పాటు గణితంలో సంఖ్యలు, కూడికలు, తీసివేతలపై ప్రశ్నలు అడిగారు. బ్లాక్‌బోర్డుపై విద్యార్థులతో అక్షరాలు, సంఖ్యలు రాయించి వారి ప్రాథమిక పరిజ్ఞానాన్ని అంచనా వేశారు. పాఠ్యాంశాలపై విద్యార్థులకు ఉన్న అవగాహనను తెలుసుకున్నారు.అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడి మొదటి, రెండో తరగతుల విద్యార్థులకు అందిస్తున్న బోధన, రాత సాధన, ఇంగ్లీష్, గణిత బోధనా విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు పరిస్థితిని సమీక్షించారు.

ప్రాథమిక స్థాయిలోనే చదవడం, రాయడం, సంఖ్యలను గుర్తించడం వంటి నైపుణ్యాలు అలవడుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులు చదువుపై ఆసక్తి పెంచుకోవాలని, ఎలాంటి భయం, బెరుకు లేకుండా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కలెక్టర్ ప్రోత్సహించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. పాఠశాలలో బోధనా కార్యక్రమాల అమలు, విద్యార్థుల అభ్యసన స్థాయిని ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు