రూ.17 కోట్లతో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనులు
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
మేడిపల్లి, నవంబర్ 25 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ మేడిపల్లి డివిజన్ పరిధిలో వర్షాకాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో సుమారు రూ.17 కోట్ల వ్యయంతో చేపట్టనున్న స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పనులపై బుధవారం క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు.
ఈ సందర్భంగా బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ(Deputy Commissioner Shailaja) ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, హెచ్ఎండిఏ, హెచ్ ఎం డబ్ల్యు ఎస్ ఎస్ బి, ట్రాఫిక్ శాఖల అధికారులు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. విహారిక, విష్ణుపురి, శ్రీ సాయి ఆర్టీసీ కాలనీ, శ్రీపాద ఎన్క్లేవ్, పంచవటి, కాకతీయ నగర్, శ్రీ సాయి నగర్, ధరణి తదితర కాలనీలకు ఈ పనులతో ముంపు సమస్య నుంచి ఉపశమనం లభించనుంది.పనులను త్వరగా ప్రారంభించి, నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు.