ఆత్మజ్ఞానంతోనే జీవితానికి పరిపూర్ణత: వేదానంద స్వామీజీ
శివంపేట నవంబర్ 25 (విజయక్రాంతి): మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామ శివారులోని శ్రీ గురుపీఠాన్ని హిమాలయ పరమహంస శ్రీ వేదానంద సరస్వతి స్వామీజీ(Swami Vedananda Saraswati) సందర్శించి, పంచాయతన సహిత దత్తాత్రేయ మహాస్వామి, షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తూ సాధన ద్వారానే గురుత్వాన్ని పొందగలమని, ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. సాయినాథుడి బోధనలు ఐక్యత, సమానత్వం, మానవత్వానికి ప్రతీకలని, భక్తి, శ్రద్ధ, సహనంతో జీవించినప్పుడే జీవితంలో ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.
గురుపీఠంతో తనకు ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడిందని, మరోసారి పీఠాన్ని సందర్శిస్తానని పేర్కొన్నారు. అనంతరం స్వామీజీతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రాజు యాదవ్, మెదక్ జిల్లా రైతు రక్షణ సమితి అధ్యక్షుడు మైసయ్య యాదవ్ లను శ్రీ గురుపీఠం ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్, రమాదేవి దంపతులు శాలువాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు రాజిపేట వెంకటేశ్వర్, నారాయణరావు, బ్యాగరి నరసయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.