కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి

25-11-2026 | 11:30pm

- వనస్థలిపురంలో సీఐటీయూ నాయకుల ఆందోళన 

ఎల్బీనగర్, నవంబర్ 25 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు(CITU leaders), కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.42వేలు  ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1, 2, 3వ తేదీల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ మేరకు బుధవారం వనస్థలిపురం రైతు బజార్ లో చిరు వ్యాపారస్తులు, తోపుడుబండ్ల కార్మికులు వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య మాట్లాడుతూ.... లేబర్ కోడ్స్ లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, పింఛన్లు పెంచాలని, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.

కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఢిల్లీలో లక్షలాది మందితో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయిన కార్మికుల వేతనాలు ఆదాయం, పెన్షన్లలో ఎదుగు, బొదుగు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 1, 2, 3వ తేదీల్లో నిర్వహిస్తున్న చలో ఢిల్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు అబ్బా భారతమ్మ, తడబోయిన కృష్ణమూర్తి, కాశమ్మ, మల్లయ్య, ఝాన్సీ, కృష్ణయ్య గౌడ్, స్వరూప, గుండప్ప, అర్జున్, ఋషి, రమేశ్ నాయక్, సుబ్బారావు, మహేశ్, వరలక్ష్మి, గాయత్రి, బాబు, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు