రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని జయప్రదం చేయాలి
మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, వెన్నెల గద్దర్
ఎల్బీనగర్, నవంబర్ 25: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన సంవిధాన్ రక్షా మార్చ్(Samvidhan Raksha March)ని ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ మధుయాష్కీగౌడ్, సంవిధాన్ రక్షా ర్యాలీ ఎల్బీనగర్ కోఆర్డినేటర్, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్ పేర్కొన్నారు.
సంవిధాన్ రక్షా మార్చ్ ను విజయవంతం చేసే విషయంపై హయత్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మధుయాష్కీగౌడ్, వెన్నెల గద్దర్ మాట్లాడుతూ.. గురువారం ఉదయం 10:30 గంటలకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ర్యాలీలో ఏఐసీసీ ఇన్ చార్జి సందీప్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారని చెప్పారు. మోడీ ప్రభుత్వ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసం అవుతున్న తీరును నిరసిస్తూ నిర్వహించే ఈ భారీ ప్రదర్శనలో సామాజిక, ప్రజాస్వామిక, అభ్యుదయవాదులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీకి మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, జిల్లా కమిటీ ప్రతినిధులు, మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీల మాజీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.