బాలుడి చికిత్సకు సీఎంఆర్ఎఫ్ ఆసరా
రూ. 6 లక్షల ఎన్వోసీ అందజేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, నవంబర్ 25: బాలుడి చికిత్సకు సీఎంఆర్ఎఫ్ ఆసరా నిలుస్తుందని, ఈ మేరకు రూ. 6 లక్షల ఎన్వోసీ చెక్కును బాధితుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy) అందజేశారు. వివరాల్లోకి వెళ్తే... చంపాపేట డివిజన్ పరిధిలోని పోచమ్మ గడ్డలో నివాసం ఉంటున్న బాలకృష్ణ కుమారుడు అభిరామ్(16), పుట్టినప్పటి నుంచి వినికిడి సమస్యలతో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేని సంప్రదించి, ఆర్థిక సాయం చేయాలని కోరారు. స్పందించిన సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం మంజూరు చేయించారు. వినికిడి సమస్య తీవ్రంగా ఉన్నవారికి వినడానికి సహాయపడే ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ పరికరం కోసం రూ. 6 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎన్వోసీ చెక్కును బాధితుడి తండ్రి బాలకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.