వాల్టా చట్టానికి తూట్లు
- ప్రైవేట్ బోర్లు నుంచి ట్యాంకర్లతో నీళ్ల విక్రయం
- ఎల్బీనగర్ నియోజకవర్గంలో అడుగంటుతున్న భూగర్భ జలాలు
- చోద్యం చూస్తున్న జల మండలి అధికారులు
ఎల్బీనగర్, నవంబర్ 25: భూగర్భ జలాల వనరుల పరిరక్షణ కోసం తెచ్చిన వాల్టా చట్టానికి క్షేత్రస్థాయిలో తూట్లు పడుతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు ప్రభావం నెలకొనడంతో అనేక ప్రాంతాల్లో నీటి సమస్యలు తలెత్తుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇదే అదనుగా ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వాల్టా చట్టాన్ని నిర్వీర్యం చేసి కొంతమంది భూగర్భ జలాలను యథేచ్ఛగా తోడుతూ నీటిని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. నీటి వ్యాపారంతో ఎల్బీనగర్(LB Nagar) నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగట్టాయి. ముఖ్యంగా మన్సూరా బాద్ డివిజన్ లో నీటి వ్యాపారం జోరుగా సాగుతోందని అనేక కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు.
- యథేచ్చగా నీటి వ్యాపారం
మన్సూరాబాద్ డివిజన్ లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు రెసిడెన్షియల్ స్థలాల్లో బోర్లు వేసి వాటి ద్వారా వచ్చే నీటిని మరో ప్రాంతంలో కందకాలు తీసి, నీటిని నిల్వ చేస్తున్నారు. నిల్వ చేసిన నీటిని అక్కడినుంచి ట్యాంకర్ల ద్వారా విక్రయిస్తూ లక్షలాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం, భూగర్భ జలాల తగ్గుదలతో జల వనరులను కాపాడుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే... కొందరు బహిరంగంగా నీటి వ్యాపారం చేస్తున్నారు. డొమెస్టిక్ బోర్ల ద్వారా కమర్షియల్ వ్యాపారం చేస్తున్నారు. ఇప్పటికైనా భూగర్భ జలాల పరిరక్షణకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అడ్డుకట్ట పడేనా..?
ప్రైవేట్ బోర్ల నుంచి వ్యాపారులు జలమండలి పేరుతో ఉన్న ట్యాంకర్లలో నీటిని నింపి విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు సైతం జలమండలి ద్వారా సరఫరా అవుతున్న నీరేనని భావించి కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ నీటిని రూ.1,500 నుంచి రూ.2,000 వరకు విక్రయిస్తూ వ్యాపారులు తమ జేబులు నింపుకుంటున్నారు. కొన్ని చోట్ల వందల అడుగుల లోతుకు బోర్లు వేసినా నీరు లభించని పరిస్థితులుంటే కొందరు వాల్టా చట్టం బంధనలను ఉల్లంఘిస్తూ భూగర్భ జలాలను వ్యాపార అవసరాలకు వినియోగిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. జలమండలి ట్యాంకర్లు రాత్రివేళలో ప్రైవేట్ వ్యక్తుల బోర్ల నుంచి నీటిని సేకరించి విక్రయిన్నారని పలువురు పేర్కొంటున్నారు. భూగర్భ జలాల ను దోచుకుంటున్న నీటి మాఫియా ను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
- కఠిన చర్యలు తీసుకోవాలి..
అక్రమంగా నీటి వ్యాపారం చేసేవారిపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. నీరు దొరకక ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటుంటే కొంతమంది నీటిని అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకొని సంబంధిత బోర్లను సీజ్ చేయాలి. కరువు నెలకొన్న నేపథ్యంలో బోర్ల తవ్వకాలను నిషేధించాలి. జల వనరుల పరిరక్షణకు వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.
- బొంగు వెంకటేశ్ గౌడ్, బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు