గిరిజన విద్యార్థులకు గోస!

10-11-2026 | 05:09pm

* సబ్బులు, కొబ్బరినూనెకు కొరత.. 

* ఆటస్థలానికీ దూరం.. 

* గొందిగూడెం ఆశ్రమ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి

బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ

అశ్వాపురం, నవంబర్ 10 (విజయక్రాంతి): గిరిజన విద్యార్థులకు(Tribal students) నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతి, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, క్రీడా సౌకర్యాలు(Personal hygiene, health, and sports facilities) కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అయితే అశ్వాపురం మండలం గొందిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో(Gondigudem Ashram School) విద్యార్థులు కనీస సౌకర్యాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారము పాఠశాలను సందర్శించిన రామకృష్ణ మాట్లాడుతూ  పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన సబ్బులు, కొబ్బరినూనె, దువ్వెనలు వంటి నిత్యావసర వస్తువులు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో వ్యక్తిగత పరిశుభ్రతకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన హెయిర్ కటింగ్ సౌకర్యం కూడా కల్పించాలని కోరారు. మరోవైపు చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి ఎంతో అవసరమైన ఆటలకు సరైన మైదానం లేకపోవడం విచారకరమన్నారు.

పాఠశాల ఆటస్థలంలో నూతన భవన నిర్మాణ సామగ్రిని నిల్వ చేయడంతో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. పాఠశాల పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని వెంటనే చదును చేసి ఆటస్థలంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. చదువుతోపాటు ఆరోగ్యం, ఆటలతోపాటు ఆత్మవిశ్వాసం విద్యార్థుల సమగ్ర వికాసానికి అవసరమని పేర్కొంటూ గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం అందించాల్సిన అన్ని సంక్షేమ పథకాలు, విద్యా రాయితీలు, వసతి సదుపాయాలు, నిత్యావసర వస్తువులు సకాలంలో అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

అధికారులు పాఠశాలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకుడు నజీర్ సోను, బీసీ సెల్ యువజన నాయకుడు అరసవల్లి పవన్, బీఆర్ఎస్ యువజన నాయకుడు చిచ్చోడి లక్ష్మణ్, గొందిగూడెం ఐదో వార్డు సభ్యుడు బండ్ల సాయి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు