ప్రత్యామ్నాయ పంటల వైపు ముందుకు వెళ్లాలి

10-11-2026 | 05:16pm
  1. వరి సాగు చేయవద్దు
  2. ఆయిల్ పామ్, కూరగాయలు, పప్పు ధాన్యాలు వేయాలి
  3. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
  4. ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరు
  5. పలువురు ఉత్తమ రైతులకు సన్మానం

గంభీరావుపేట, నవంబర్ 10 (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్(Collector Garima Agrawal) పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజేశ్వర్ రావు నగర్ లో ఖేత్ బచావో అభియాన్ ఎల్ నినో ప్రభావం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఇటీవల  ఆయిల్ పామ్ మొక్కలు నాటిన పలువురు రైతులను సన్మానించారు. 

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సూపర్ ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు రైతులు వరి సాగు చేయవద్దని సూచించారు. వరి సాగు చేస్తే నీరు భారీగా అవసరమని వెల్లడించారు. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పొడి ఎండ వాతావరణంతో రాను రాను రాను భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని వివరించారు.  గంభీరావుపేట మండలంలో గత ఏడాది భూగర్భ జలాలు 5.96 మీటర్ల లోతులో ఉండేవని, ఈ ఏడాది 8.39 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు పడిపోయాయని తెలిపారు.

దీంతో గత నెలలో విద్యుత్ వినియోగం 25 శాతం పెరిగిందని వెల్లడించారు. రైతులు మంచి ఆదాయం వచ్చే.. నీటిని తక్కువగా వినియోగించే పంటలు సాగు చేయాలని సూచించారు. ఆయిల్ పామ్ లో మొదటి మూడు ఏండ్లు అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్, మొక్కలు ఇస్తామని తెలిపారు. వీటి సాగు కోసం డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు వాడి నీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయిల్ ఫామ్ కు టన్ను ధర ప్రస్తుతం 22 వేల 658 ఉందని వెల్లడించారు.

అలాగే జిల్లాకు దగ్గర్లోనే సిద్దిపేటలో జిల్లాలో ఆయిల్ ప్లాన్ ఫ్యాక్టరీ ఉందని వివరించారు. ఆయిల్ ఫామ్ ఉత్పత్తులు సేకరించే కేంద్రం మండలంలోనే ఉందని గుర్తు చేశారు.జిల్లాలో గత సీజన్లో అవగాహన సదస్సులు, కార్యక్రమాలతో 40 వేల ఎకరాల వరకు వరి సాగు తగ్గిందని, 700కు పైగా ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగులోకి వచ్చిందని తెలిపారు. పంటల మార్పిడితో నేలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఇల్లు, వ్యవసాయ క్షేత్రాల వద్ద నీటి, విద్యుత్ వృథాను అరికట్టాలని పిలుపు నిచ్చారు. 

తెలంగాణ జలసిరి పనులు

వీబీజీరామ్ జీ కింద జిల్లాలో తెలంగాణ జలసిరి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పామ్ పాండ్ లు నిర్మించుకోవాలని పేర్కొన్నారు. 

దీంతో భూగర్భ జలాలు వృద్ది చెందుతాయని, పంటల సాగుకు ఉపయోగపడతాయని తెలిపారు. కొందరు రైతులు వాటిలో చేపలు పెంచుతూ ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత సూపర్ ఎల్ నినో ప్రభావంతో రైతులు నువ్వులు, వేరుశనగ, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, ఆయిల్ ఫామ్ చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీఓ రాజేందర్, సర్పంచ్ పిట్ల బాబు సింగల్ విండో చెర్మన్ వేషాల వెంకటి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు