కొత్త పింఛన్ల మంజూరుపై హర్షం
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్
ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 4.29 లక్షల మందికి పింఛన్లు మంజూరు
ఖమ్మం, నవంబర్ 10 (విజయంక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్ల(New Pensions)ను మంజూరు చేయడంపై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, ఆరు గ్యారంటీలలో భాగంగా వికలాంగులు, ఒంటరి మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా 4.29 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేయించినందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మంత్రివర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
గత ప్రభుత్వం ధనిక తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందని, ప్రభుత్వ ఉద్యోగులకు 7వ, 10వ తేదీల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని ఆయన గుర్తుచేశారు. ఆ పరిస్థితిని అధిగమించి, 2024 జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 5వ తేదీన, సంక్షేమ ఉద్యోగులకు 10వ తేదీన జీతాలు ఇస్తూ, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు, వడ్డీ కలిపి ఈ 34 నెలల్లో రూ. 2 లక్షల కోట్లకు పైగా చెల్లించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ప్రభుత్వానికి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. బడుగు, బలహీన, అన్ని వర్గాల ప్రజాక్షేమాన్ని కోరే కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ అండగా ఉండాలని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.