రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
ఖమ్మం, నవంబర్ 10 (విజయంక్రాంతి): ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ ప్రజల భద్రతకు విఘాతం కలిగిస్తున్న బానోత్ ఆనంతు(23)పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. బైక్ స్టంట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్(Police Commissioner Sunil Dutt) ఆదేశాల మేరకు ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలపేట ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఎస్సై వరాలు శ్రీనివాస్ , ఖమ్మం అర్బన్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 250 సీసీ TS09FL6678 నెంబర్ బైక్ నెంబర్ తో రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న బానోత్ ఆనంతును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. యువత ప్రమాదకరమైన విన్యాసాలకు దూరంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే నిఘా విభాగంతో పాటు పోలీస్ శాఖలోని వివిధ విభాగాల పోలీసులు సీరియస్ గా దృష్టి పట్టారని, ప్రజలను భయబ్రాంతులకు గురైయేలా బైక్ స్టంట్లు చేస్తూ పట్టుబడితే చట్టవ్యతిరేక, తీవ్రమైన చర్యగా కేసులు తప్పవని పేర్కొన్నారు.