24వ ఉర్సే షరీఫ్ మహోత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి
మతసామరస్యానికి ప్రతీకగా ఉర్సే షరీఫ్ వేడుకలు..
మంత్రి ఆకాంక్ష
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లెందులో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న 24వ ఉర్సే షరీఫ్ (గంధం, ఉర్సు) మహోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఆవిష్కరించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉర్సు నిర్వాహకులు మంత్రిని కలిసి వేడుకల వివరాలను వివరించి, ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. అనంతరం నిర్వాహకులు, నాయకులతో కలిసి మంత్రి పోస్టర్ను ఆవిష్కరించారు.
మతసామరస్యానికి, సోదరభావానికి ప్రతీకగా నిలిచే ఉర్సే షరీఫ్ మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ ఉత్సవాలు విజయవంతం కావాలని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డ డానియల్, పులిగండ్ల మాధవరావు, దర్గా కమిటీ సభ్యులు సుమన్, సైదా మియా, ఎం.సి. నాగిరెడ్డి, బి. వెంకటేశ్వర్లుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉర్సు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.