ఐపీపీబీ భీమాతో కుటుంబానికి ఆర్థిక భరోసా
- జీఏజీ ఇన్సూరెన్స్తో రూ.10 లక్షల పరిహారం
- నామినీ సనప భద్రయ్యకు క్లెయిమ్ చెక్కు అందజేత
గుండాల, నవంబర్ 25 (విజయక్రాంతి): ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (India Post Payments Bank) అందిస్తున్న జీఏజీ భీమా పథకం ఓ కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలిచింది. సాయనపల్లి గ్రామానికి చెందిన సనప సారయ్య ఐపీపీబీ ద్వారా ఏడాదికి రూ.550 ప్రీమియంతో జీఏజీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించడంతో పాలసీ నిబంధనల ప్రకారం నామినీగా ఉన్న ఆయన తండ్రి సనప భద్రయ్యకు రూ.10 లక్షల భీమా పరిహారం మంజూరైంది. బుధవారం సాయనపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్ పరిధిలో ఇల్లందు సబ్ పోస్టాఫీస్ ఆధ్వర్యంలో భీమా క్లెయిమ్ చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐపీఓ ఇల్లందు చిన్న యాకయ్య, ఐపీపీబీ బ్రాంచ్ మేనేజర్ శరత్ చంద్ర చేతుల మీదుగా నామినీ సనప భద్రయ్యకు రూ.10 లక్షల భీమా క్లెయిమ్ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు చిన్న మొత్తంలో ప్రీమియం చెల్లించి భీమా పాలసీలు తీసుకోవడం ద్వారా తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించుకోవచ్చని సూచించారు. అనుకోని ప్రమాదాలు, కుటుంబ పెద్దల మరణం వంటి క్లిష్ట పరిస్థితుల్లో భీమా పరిహారం బాధిత కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఓలు లక్ష్మీ నరసింహారావు, అబ్దుల్, గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తి కృష్ణవేణి, కార్యదర్శి బండారి శ్రీలోక్, ఉపసర్పంచ్ సమ్మయ్య, మండల పోస్టల్ సిబ్బంది, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.