అమెజాన్‌లో 250 మంది తొలగింపు
ఉదయాన్నే ఉద్యోగులకు ఈమెయిల్
ముంబై, అక్టోబర్ 29: ప్రముఖ అమెజాన్(Amazon) కంపెనీలో ఉద్యోగాల తొలగింపు మళ్లీ మొదలైంది. ఉన్నపళంగా 250 మంది ఉద్యోగులను అమెజాన్ యాజమాన్యం తొలగించింది. ఉదయాన్నే ఉద్యోగులకు మిమ్నల్ని ఉద్యోగాలనుంచి తొలగిస్తున్నట్లు ఈ మెయిల్ పంపింది. దీంతో సమాచారం అందుకున్న ఉద్యోగులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా కిండిల్ ఈ-రీడర్స్, ఎకో స్మార్ట్ స్పీకర్ల వ్యవహారాలు చూసే యూనిట్లో సంస్థ ఈ కోతలు పెట్టింది. ఈ ఏడాదిలో అమెజాన్ మూడుసార్లు ఉద్యోగులను ఉద్వాసన పలికింది.
సుమారు వెయ్యి మంది భారతీయులను తొలగించారు. అమెజాన్ ఈ కోతలను సమర్థించుకుంది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, తమ సిబ్బందిని ఉత్పత్తి వ్యూహానికి అనుగుణంగా సర్దుబాటు చేయడానికి ఈ చర్య అవసరమని సంస్థ పేర్కొంది. రోజురోజుకు వస్తున్న మార్పులను స్వాగతించాలని, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ప్రాక్టీస్‌కు ఏఐ కీలకం కాబోతుందని పేర్కొంది. కాగా.. అమెజాన్ ఐదు కొత్త అలెక్సా పవర్డ్ పరికరాలను కొనుగోలు చేసిన రోజే ఉద్యోగాల కోతలను చేపట్టింది. ఈ కొత్త పరికరాల్లో ఎకోషో 16 స్మార్ట్ డిస్ప్లే, అలెక్సా ఫోటో ఫ్రేమ్, ఎకో టైమ్ బెడ్‌సైడ్ క్లాక్ ఉన్నాయి. ఈ పరికరాలను కంపెనీకి చెందిన డివైసెస్ విభాగం అభివృద్ధి చేసింది. ఈనెల మొదట్లో కూడా అమెజాన్ తన ప్రధాన రిటైల్ విభాగంలో దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.