క్రీడలతో ప్రపంచస్థాయి గుర్తింపు సాధ్యం
సుల్తానాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): క్రీడల్లో (Sports) రాణిస్తే ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ అన్నారు. ఆదివారం సుల్తానాబాద్‌లోని ఎస్‌ఎన్‌ఆర్ టేబుల్ టెన్నిస్ అకాడమీలో 70వ ఎస్‌జీఎఫ్ తెలంగాణ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు (Table Tennis) అండర్-17 బాలబాలికల విభాగంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అంతటి అన్నయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రతిభ కనబరిస్తే క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. క్రీడలతో పాటు పుస్తక పఠనానికి (Reading) ప్రాధాన్యత ఇస్తే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా క్రీడారంగంలో ప్రపంచస్థాయి గుర్తింపు పొందే స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని అన్నారు. సుల్తానాబాద్ మండలం మొదటి నుంచి క్రీడలకు పుట్టినిల్లుగా నిలుస్తోందని, ఇక్కడి నుంచి పలువురు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. గెల్లు మధుకర్ భారతదేశం తరఫున ఖోఖోలో ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, పారుపల్లి వైకుంఠపతి, వెంకట ఉమాపతి, గాజుల రాజమల్లు, ఆయిల రమేష్, ముస్త్యాల రవీందర్ క్రీడల్లో రాణించడంతో పాటు ఎంతోమంది క్రీడాకారులను తీర్చిదిద్దారని కొనియాడారు.
సుల్తానాబాద్‌లో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని, ఇందుకు కృషి చేసిన బొల్లి సత్యనారాయణను ప్రశంసించారు. అనంతరం నిర్వాహకులు అతిథులను శాలువాలతో సన్మానించారు. అతిథులు, సీనియర్ క్రీడాకారులు టేబుల్ టెన్నిస్ ఆడి పోటీలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్పలత, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్, వార్డు కౌన్సిలర్లు, గాజుల రాజమల్లు, శ్రావణి రాకేష్, ప్రభాకర్, గదాస్ రవి, పద్మ, అబ్బాయిగౌడ్, జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి రమేష్, మండల కన్వీనర్ తాండ్ర ప్రణయ్, వివిధ జిల్లాల కోచ్‌లు, మేనేజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.