మధిరలో పెద్దపులి కలకలం
ఖమ్మం, మధిర, నవంబర్ 29 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని అంబర్పేట, మాటూరు, మాటూరుపేట, రాయపట్నం ప్రాంతాల్లో శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెద్దపులి సంచరించినట్లు ప్రచారం జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో ఆందోళన నెలకొంది. పులి సంచారం (Tiger Movement) గురించి గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ, పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలపై నిఘా (Surveillance) ఏర్పాటు చేశారు.
మాటూరుపేట, అంబర్పేట ప్రాంతాల్లోని సుబాబుల్ తోటలో పులి సంచరించినట్లు అనుమానిస్తున్న ప్రదేశాన్ని రూరల్ ఎస్సై విశ్వతేజ, డీఆర్ఓ వెంకటలక్ష్మి, ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అక్కడ కొన్ని పాదముద్రలను గుర్తించారు. అయితే అవి పెద్దపులికి సంబంధించినవా? లేక ఇతర అటవీ జంతువులవా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అధికారులు పులి కదలికలను పరిశీలిస్తున్నారు.
అంబర్పేట, మాటూరు, మాటూరుపేట ప్రాంతాల్లో పెద్దపులి సంచరించినట్లు సమాచారం అందిందని ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పులి కదలికలను గమనిస్తున్నామని, దాని ఆచూకీ గుర్తించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. పులి సంచారంపై కచ్చితమైన ఆధారాలు తెలుసుకునేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామస్థులు ఆందోళన చెందవద్దని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.