కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది
కామారెడ్డి, నవంబర్ 29 (విజయక్రాంతి): కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన దీక్షా దివస్తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన దీక్షా దివస్ (Deeksha Diwas) కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ (Free Power) అందించడం జరిగిందన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్ష చేపట్టి తెలంగాణ ప్రజలను ఏకం చేసిన ఏకైక నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని గంప గోవర్ధన్ కొనియాడారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రామ్ రెడ్డి, బాలరాజు, వజ్జపల్లి ఆంజనేయులు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.