తెలంగాణకు పొంచిన నీటి ముప్పు
ఎల్ నినో(El Nino) తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉప రితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు దేశ వ్యాప్తంగా రుతుపవనాల గమనాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. తద్వారా రాష్టంలో వర్షపాతం తగ్గడమే కాకుండా వ్యవసాయ ం, తాగునీరు, భూగర్భజలాలు, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొలాలు, బోర్లు, చెరువులు, జలాశయాల్లో నీటి లెక్కలను తారుమారు చేసే పరిస్థితి ఉంది. రోజురోజుకూ ఎల్ నినో బలపడుతున్న నేపథ్యంలో రాబోయే కాలంలో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, నీటి లభ్యతపై అనిశ్చితి నెలకొననుంది.
అయితే ఎల్ నినో ఏర్పడిన ప్రతీసారి కరువు తప్పదనుకోవడం సరికాదని వాతావరణ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జూన్ సెప్టెంబర్ నైరుతి రుతుపవన కాలంలో తెలంగాణలో 615.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 740.6 మి.మీ. కాగా 125.1 మి.మీ లోటు ఏర్పడింది. అంటే సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షం కురిసింది. రాష్ట్ర సగటు వర్షపాతం సాధారణ వర్గంలోనే ఉన్నప్పటికీ.. 33 జిల్లాల్లో 18 జిల్లాలు లోటు వర్షపాతంతో సీజన్‌ను ముగించాయి.ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తెలంగాణ వార్షిక సాధారణ వర్షపాతంలో దాదాపు 80 శాతం నైరుతి రుతుపవనాల నుంచే వస్తుంది.
ఈ నాలుగు నెలల్లో కురిసే వర్షాలే సాగుకు ఆధా రం. భూగర్భజలాల రీచార్జ్, జలాశయాల నీటి నిల్వలకూ కీలకం. ఈ కాలంలో ఏర్పడే లోటు వర్షపాతం మొత్తం నీటి భద్రతపై ప్రభావం చూపుతుంది. ఎల్ నినో ప్రభావం వ్యవసాయానికి ఒకే విధంగా ఉండదు. ఈ ఏడాది జూన్‌లో 12 శాతం లోటు ఉండగా జూలైలో దాదాపు సాధారణంగా ఉంది. ఆగస్టులో మాత్రం 38 శాతం లోటు వర్షం కురిసింది. అంటే సీజన్ మొత్తం లెక్కలో 17 శాతం లోటు కనిపించినా.. పంటకు అవసరమైన సమయంలో వర్షా లు కురువకపోతే రైతులపై ప్రభావం మరింత తీవ్రంగా ఉండొచ్చు.
అస్థిర వర్షపాతం
రాష్ట్ర వ్యవసాయశాఖ ఇప్పటికే అస్థిర వర్షపాతం కారణంగా పంటల సరళిలో మార్పులను పరిశీలిస్తోంది. తక్కువ నీటి తో సాగయ్యే పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల వైపు మార్పు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. జూలైలో నిపుణుల కమిటీ సమా వేశంలో గత ఏడాదితో పోలిస్తే భూగర్భజల మట్టాలు సుమారు ఒక మీటరు తగ్గిన ట్లు కూడా వెల్లడైంది. వర్షాలు తగ్గితే మొదట కనిపించేది పొలాల్లో కాదు.. భూమి అడుగున.
చెరువులు, కుంటలు, వాగుల్లోకి చేరే నీరు తగ్గితే భూగర్భజలాల పునరుద్ధరణ మందగిస్తుంది. బోర్లపై ఆధారపడే ప్రాంతాల్లో సాగునీటితో పాటు గ్రామీణ తాగునీటి వనరులపైనా ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్ర నీటిపారుదల డేటా ప్రకారం అక్టోబర్ మధ్య నాటికి 87 ప్రధాన జలాశయాల మొత్తం సామర్థ్యం 1,059.3 టీఎంసీలు కాగా, నిల్వ 492.53 టీఎంసీలు. అంటే సుమారు 46.5 శాతం. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యతరహా నీటిపారుదల చెరువులు 21,500 ఉండగా, వాటి సామర్థ్యం 253.8 టీఎంసీలు, నిల్వ 93.51 టీఎంసీలు. అంటే సుమారు 36.9 శాతం. ఈ సంఖ్యలు వేసవి వైపు వెళ్లే కొద్దీ నీటి నిర్వహణ ఎందుకు కీలకమో చెబుతున్నాయి.
జలాశయాల నిల్వలు తగ్గితే వ్యవసాయం మాత్రమే ప్రభావితం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో బోర్లు, చెరువులపై ఆధారపడే తాగునీటి వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతుంది. హైదరాబాద్‌కు నీరు అం దించే ప్రధాన జలాశయాల్లోకి ప్రవాహాలు తగ్గితే నగర తాగునీటి నిర్వహణ కూడా క్లిష్టమవుతుంది. ఇప్పటికే ఏడాది చివర్లో నగరానికి నీటి ఒత్తిడి పెరిగే అవకాశం ఉం దని నివేదికలు వెలువడ్డాయి. నీటి కొరత ప్రకృతిపైనా ప్రభావం చూపుతుంది. చెరువులు, చిన్న జలాశయాలు క్షీణిస్తే చేపలు, నీటి పక్షులు, ఉభయచరాల ఆవాసాలు దెబ్బతినవచ్చు. అడవుల్లో నీటి వనరులు తగ్గితే వన్యప్రాణులు మానవ నివాసాల వైపు కదిలే అవకాశముంది. దీర్ఘకాలిక వేడి, పొడి వాతావరణం అటవీ అగ్నిప్రమాదాల ముప్పును కూడా పెంచవచ్చు.
ముందున్నది అసలు పరీక్ష
వాతావరణ శాఖ లెక్కల ప్రకారం జూన్‌లో ఎల్ నినో డిసెంబర్ నాటికి మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే ఎల్ నినో ప్రభావాన్ని ఇతర సముద్ర వాతావరణ పరిస్థితులతో కలిపి చూడాల్సి ఉంటుంది. అందుకే తెలంగాణకు ముందున్న ప్రశ్న.. వచ్చే సీజన్లో ఎంత వర్షం పడుతుంది? అన్నదొక్కటే కాదు. ప్రస్తుతం జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలను ఏ మేరకు వేసవి వరకు కాపాడగలం? భూగర్భజలాలను ఏ స్థాయిలో రీచార్జ్ చేయగలం? రైతులకు ఏ పంటలు భద్రమైనవి? గ్రామాల తాగునీటి వనరులకు ఎంత ముందస్తు రక్షణ కల్పించగలం? అన్నది కీలకం.
మానకొండూరు, కరీంనగర్ జిల్లా
భూమయ్య అన్నలదాసు