పేదలకు అండగా సీఎం సహాయ నిధి
120 మంది లబ్ధిదారులకు రూ.65.25 లక్షల సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ,(విజయక్రాంతి): పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతరం సేవలందిస్తున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy ) అన్నారు. శనివారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన సుమారు 120 మంది లబ్ధిదారులకు రూ.65 లక్షల 25 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల(CM Relief Fund Checks)ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం పొందేందుకు ఎవరూ దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని, మధ్యవర్తులకు వందలు, ఐదువందలు, వేల రూపాయలు ఇచ్చి మోసపోవద్దని సూచించారు. ప్రజలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లేదా తమ తమ డివిజన్లలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా దరఖాస్తు చేసుకుంటే, వాటిని స్వయంగా పరిశీలించి హైదరాబాద్కు తీసుకెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడి మంజూరు చేయించే బాధ్యత తాము తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రతి నెలా రెండుసార్లు సీఎం సహాయ నిధి చెక్కులను తీసుకొచ్చి లబ్ధిదారులకు అందిస్తున్నామని, లబ్ధిదారులు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా వారి ఇళ్ల వద్దకే చెక్కులు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఆయా డివిజన్ల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షుల ద్వారా లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్నామని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరవేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ప్రజల కష్టాల్లో తోడుగా నిలవడం, అర్హులకు ప్రభుత్వ సహాయం అందించడం, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడం తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్లు రాజు యాదవ్, శ్రీమాన్, వేముల శ్రీనివాస్, నాగరాజు, అబుబక్కర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.