అక్కంపేట గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతాం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
హనుమకొండ అర్బన్: తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేట గ్రామాన్ని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి(MLA Revuri Prakash Reddy) అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోడల్ విలేజ్ గా ఎంపిక చేసిన నేపథ్యంలో గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులు, అందుకు తీసుకోవాల్సిన చర్యలపై కుడా ఛైర్ పర్సన్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమావేశాన్ని నిర్వహించారు.
గ్రామంలో ప్రస్తుతం ఉన్న సామాజిక, అభివృద్ధి సంబంధించిన వివిధ అంశాలపై సమీక్షించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మోడల్ విలేజ్ గా అక్కంపేట గ్రామాన్ని ఎంపిక చేయడంతో గ్రామ అభివృద్ధి రూపురేఖలు మారనున్నాయన్నారు. చేపట్టే అభివృద్ధి పనులతో గ్రామానికి ఆహ్లాదకర వాతావరణం తీసుకురావాలన్నారు.
గ్రామంలోని విద్యార్థులు, యువతకు ఉపయోగపడేవిధంగా గ్రంథాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సామ్య నాయక్, కుడా సిపిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, మిషన్ భగీరథ ఈఈ గాయత్రి, తహసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, అక్కంపేట గ్రామ సర్పంచ్ సాంబయ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.