విందు వినోదాల్లో కాగజ్ నగర్ మున్సిపల్ ఉద్యోగులు..?

25-11-2026 | 10:30pm

ఆతిథ్యం ఇచ్చిన కమిషనర్..?

కాగజ్ నగర్, నవంబర్ 25 (విజయక్రాంతి): విధులు సక్రమంగా  నిర్వహిస్తు.. ప్రజలకు సేవలు అందించాల్సిన మున్సిపల్ ఉద్యోగులు ఏకంగా విధులకు డుమ్మా కొట్టి.. విందు వినోదాలు చేసుకోవడం పట్ల ప్రజల్లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్(Kagaznagar municipal) ఉద్యోగులు బుధవారం విధులు నిర్వహించకుండా విందు వినోదాలు చేసుకున్న ఘటన వెలుగు చూసింది. ఏకంగా మున్సిపల్ కమిషనర్ తిరుపతి వీరికి సిర్పూర్ టి మండలంలోని పెద్ద బండ అటవీ ప్రాంతంలో గల దేవాలయంలో విందు ఇచ్చినట్టు సమాచారం.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో ప్రజల చేత ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేయించాల్సిన సమయంలో ఏకంగా ఉద్యోగులను వెంటపెట్టుకొని మున్సిపల్ కమిషనర్ విందులు ఏర్పాటు చేయడం పట్ల పట్టణ ప్రజల్లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకునేందుకు పలు వార్డుల్లో ప్రజలు వార్డు అధికారుల కోసం రోజంతా వేచి చూసిన వార్డు అధికారులు రాకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా మధ్యాహ్న సమయంలో సబ్ కలెక్టర్ హర్ష చౌదరి మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఆరా తీసి.. వెళ్లినట్లు సమాచారం..? ఆ సమయంలో కార్యాలయంలో కుర్చీలు అన్ని ఉద్యోగులు లేక ఖాళీగా కనిపించినట్లు, కార్యాలయంలో ఒక అటెండర్, మరో ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ బి. తిరుపతిని సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. అదేవిధంగా కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరిని సంప్రదించగా స్పష్టమైన సమాధానం చెప్పలేదు. మరి ఈ విషయంలో ఉన్నత శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు, ఉద్యోగులపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

మరిన్ని వార్తలు