ఎలక్ట్రిక్ స్కూటీ ఢీకొని వ్యక్తి మృతి

25-11-2026 | 10:50pm

మల్లాపూర్, నవంబర్ 25 (విజయక్రాంతి): ఎలక్ట్రిక్ స్కూటీ వెనుక నుంచి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మల్లాపూర్ మండలం(Mallapur Mandal)లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తదాం రాజుపల్లి గ్రామానికి చెందిన బట్టు రవి (50) ఈ నెల 24న సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో అయ్యప్ప స్వామి పూజ నిమిత్తం స్నానం ముగించుకుని గుడికి నడుచుకుంటూ వెళ్తున్నారు.

మార్గమధ్యలో బద్దం సుగుణ ఇంటి వద్దకు చేరుకోగానే, వెనుక నుంచి ఎలక్ట్రిక్ స్కూటీపై వస్తున్న నోముల అనంత రెడ్డి అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడుపుతూ రవిని ఢీకొట్టాడు. దీంతో రవి కిందపడిపోవడంతో తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి భార్య బట్టు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్లాపూర్ ఎస్ఐ ఏ. అనిల్ తెలిపారు.

మరిన్ని వార్తలు