ఫోక్సో చట్టంపై అవగాహన
ముదిగొండ (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాల ముదిగొండలో ప్రిన్సిపాల్ మల్లిక అధ్యక్షతన, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫోక్సో చట్టం(POCSO Act)పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ యశోద పాల్గొని విద్యార్థులకు చట్టంపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల లోపు బాల బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధించినా ఫోక్సో చట్టం ప్రకారం కఠిన శిక్ష ఉంటుందని తెలిపారు.
విద్యార్థులు ఈ వయసులో ఇటువంటి విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అంతేకాకుండా పొగాకు, దాని ఉత్పత్తుల వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడతారని హెచ్చరించారు. ప్రస్తుతం యువత గంజాయి, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు లోనై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులందరూ చట్టాలపై అవగాహన పెంచుకొని మంచిగా చదువుకొని గొప్ప స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మోదుగు వెంకటేశ్వర్లు, ఏజీఎంఓ శ్రీనివాసరావు, స్టూడెంట్ కౌన్సిలర్లు ఆర్. ఆమోస్, టి. ఉష, లెక్చరర్లు ఆర్. శంకర్, రమణ, రామారావు, అక్రమ్, లక్ష్మణ్ బాబు, సుమతి, శ్రీవాణి, దుర్గాదేవి, డి. రవీందర్ రెడ్డి, సాయి ప్రసన్న కుమార్ మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.