రైతు సంక్షేమమే లక్ష్యం.. అభివృద్ధే మా నినాదం
పెద్ద లింగారెడ్డిపల్లిలో నూతన పంపాండ్ నిర్మాణ పనులు వేగవంతం
సిద్దిపేట రూరల్, నవంబర్ 25: గ్రామాభివృద్ధితో పాటు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పెద్ద లింగారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు గ్రామ సర్పంచ్, సిద్దిపేట రూరల్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బట్టు భాస్కర్ రెడ్డి(Battu Bhaskar Reddy) తెలిపారు. రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపరిచే లక్ష్యంతో తన బావి వద్ద నూతన పంపాండ్ నిర్మాణ పనులు చేపట్టామని, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పంపాండ్ నిర్మాణం పూర్తయితే నీటి నిల్వ సౌకర్యం మెరుగుపడి రైతులకు సాగునీటి వినియోగంలో మరింత వెసులుబాటు కలుగుతుందన్నారు.
వ్యవసాయానికి నీరే ప్రధాన ఆధారమని, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మాటలకే పరిమితం చేయకుండా అభివృద్ధి పనుల ద్వారా ఆచరణలో చూపిస్తామని, ప్రతి పనిలో నాణ్యతకు పెద్దపీట వేస్తూ పెద్ద లింగారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కేమ్మసరం మాధవి, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.