పోలీస్ స్టేషన్‌లో దళిత వార్డు సభ్యుడిపై దాడి..

25-11-2026 | 10:42pm
  1. ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి....
  2. ఎస్సై శ్రీశైలంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి..
  3. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సుర్పంగ శివలింగం డిమాండ్...
  4. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం.. ఎస్పీ, డీఎస్పీ తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి...

ఆలేరు, నవంబర్ 25 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌లో దళిత వార్డు సభ్యుడు జాలిగం కనకరాజుపై దాడి చేసి, కులం పేరుతో దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ శ్రీశైలం(SI Srisailam)ను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సుర్పంగ శివలింగం డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా శివలింగం మాట్లాడుతూ.. తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దళిత వార్డు సభ్యుడు జాలిగం కనకరాజును ఈ నెల 23న ఎలాంటి అరెస్ట్ వారెంట్, సరైన కారణం లేకుండా పోలీసులు ఇంటి నుంచి అదుపులోకి తీసుకొని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు. అంతకుముందు ఈ నెల 22న ఏఎస్ఐ మహిపాల్ ఫోన్ చేసి వెంటనే స్టేషన్‌కు రావాలని, లేదంటే ఇంటికి వచ్చి పోలీసు వాహనంలో తీసుకెళ్తామని బెదిరించినట్లు తెలిపారు.

మరుసటి రోజు ఇద్దరు కానిస్టేబుళ్లను ఇంటికి పంపించి కనకరాజును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని, అక్కడ దొంగతనం కేసులో నిందితులుగా ఉన్నవారి పక్కన కూర్చోబెట్టడాన్ని ఆయన అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎస్ఐ శ్రీశైలం స్టేషన్‌కు వచ్చిన అనంతరం కనకరాజును కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని, చంపుతానంటూ బెదిరించారని ఆరోపించారు. మర్రి ఆగంరెడ్డి, జాలిగం కనకరాజు మధ్య ఉన్న అప్పు, డబ్బుల లావాదేవీల విషయంలో పోలీస్ స్టేషన్‌లోనే సివిల్ సెటిల్మెంట్ చేయడం నిబంధనలకు విరుద్ధమని శివలింగం పేర్కొన్నారు. ఒకవైపు ఫిర్యాదుదారుడిని కుర్చీలో కూర్చోబెట్టి, మరోవైపు దళిత వార్డు సభ్యుడిని దూషిస్తూ దాడి చేయడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు.

ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు తగిన స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, డీఎస్పీ రవీందర్ యాదవ్ వెంటనే జోక్యం చేసుకొని ఎస్ఐ శ్రీశైలంను సస్పెండ్ చేయడంతో పాటు ఏఎస్ఐ మహిపాల్, సంబంధిత కానిస్టేబుళ్ల పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యులందరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అనంపట్ల కృష్ణ, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగారం శంకర్, ఎరుకల హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కుతాడి సురేష్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్, టీపీసీసీ నాయకులు దర్గాయి హరిప్రసాద్, జాలిగం హరి శివప్రసాద్, దర్గాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు