ప్రభుత్వం చిల్లర డ్రామాలు

09-09-2026 | 05:35am

మా నాయకురాలికి జరిగిన అవమానంపై సీఎం క్షమాపణ చెప్పాలి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో అనేక ప్రజాసమస్యలు నెలకొన్నాయని,- అవన్నీ చర్చకు రాకుండా తప్పించుకోవడానికే ప్రభుత్వం, సీఎం చిల్లర డ్రామాలు, చిల్లర వేషాలు వేస్తున్నారు.. తప్ప ఇంకేమీ లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) విమర్శించారు. శాసనసభలో తమ నాయకురాలికి జరిగిన అవమానంపై కచ్చితంగా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీకి వస్తూ.. వాహనం వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. 420 హామీలు, 1000 రోజుల పరిపాలనతో పాటు అన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, అన్నీ అర్థం చేసుకుంటారని చెప్పారు. తప్పకుండా శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అన్ని విషయాల్లోనూ సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తామని తెలిపారు. సీఎం బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీల అంశంలో శాసనమండలిలో చర్చ జరుగుతుందన్నారు. తమ నాయకురాళ్లపై దాడి చేసిన కేసులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమీ సాధించిందంటే, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.

ఈ మేరకు కేటీఆర్ తన ఎక్స్‌లో పోస్టు చేశారు. 420 హామీలు అమలు అవుతాయంటే  తాము స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతామన్నారు. ‘మే ము సిద్ధం, మీరు సిద్ధ మా?’ అని సవాల్ చేశారు. అలానే ‘మీకు మహిళల పట్ల గౌరవం ఉంటే- సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి చీరలు లాగి, మెడపట్టి గెంటి, కొట్టిన వారిపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. హైకోర్టు స్పష్టంగా చెప్పాక కూడా కావాలని ఫేక్ కేసు లు పెట్టి తాతా మధు, నవీన్‌రెడ్డిని అరెస్టులు చేశారంటే ‘మీకు కోర్టులు, చట్టాల పట్ల ఉన్న గౌరవం అర్థం అవుతుంది’ అని విమర్శించారు. ప్రజలు రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్‌ను గమనిస్తున్నారని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు