హైదరాబాద్‌లో శ్రీలంక బౌద్ధ ప్రతినిధులు
రాష్ట్ర పర్యాటక శాఖ, పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులతో సమావేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): శ్రీలంకకు చెందిన బౌద్ధ భిక్షువు, సహాన్య ఫౌండేషన్ (Sahanya Foundation)చైర్మన్ అగ్రహీర్ కస్సప ధీరో, కౌసల్య, వైభవ్‌లతో కూడిన బౌద్ధ ప్రతినిధుల బృందం మంగళవారం ఉదయం ప్రభుత్వ పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమిని మర్యాదపూర్వకంగా కలిసింది.
బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో శ్రీలంక మధ్య బౌద్ధ సాంస్కృతిక సంబంధాలు, బౌద్ధ వారసత్వ పరిరక్షణ, అధ్యయనం, పర్యాటక అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న బుద్ధవనంలో బౌద్ధ సంస్కృతి, చరిత్ర, తత్వశాస్త్రం, అధ్యయనానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీలంక ప్రతినిధులు తమ ప్రతిపాదనలను ఈ సందర్భంగా సమర్పించారు.
వాణి ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణలో సుమారు ఎనిమిది ముఖ్యమైన బౌద్ధ చారిత్రక ప్రదేశాలు ఉన్నాయని, వాటిని బుద్ధవనాన్ని కేంద్రంగా చేసుకుని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. శ్రీలంక బౌద్ధ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం, పర్యాటకాభివృద్ధి సంస్థ తరఫున అవసరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
అనంతరం భూటాన్‌కు చెందిన ట్రావెల్, టూరిజం, బౌద్ధ ప్రతినిధులు మాజీ ఎంపీ రంజన్ జమిస్తో, సోల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లాంగ్రా డోర్జీలు కూడా అధికారులను కలిశారు. భూటాన్ దేశాల మధ్య, ముఖ్యంగా బుద్ధవనం సందర్శనకు భూటాన్ నుంచి బౌద్ధ పర్యాటకులను ఆకర్షించే అవకాశాలు, పరస్పర పర్యాటక సహకారం తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, ఇన్చార్జి మేనేజర్ డి.ఆర్. శ్యాంసుందర్ రావు పాల్గొన్నారు.