ఘనంగా వారాంతపు నివాళి కార్యక్రమం

22-11-2026 | 03:57pm

జగిత్యాల, నవంబర్ 22 (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఏ ఒక్క కులానికో, వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదని, దేశంలోని అన్ని కులాలు, మతాలు, వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన మహనీయుడని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు గోపోజు రమేష్ బాబు(National Mala Mahanadu President Gopoju Ramesh Babu) అన్నారు. ప్రతి ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన వారాంతపు నివాళి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసమే కాకుండా మహిళల హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కూడా పోరాడిన గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన ఓటు హక్కు కల్పించడంలో ఆయన కృషి ఎనలేనిదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని, బహుజనులు, మైనారిటీలు, అణగారిన వర్గాలు రాజకీయంగా, సామాజికంగా ఐక్యమై రాజ్యాధికారాన్ని సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. ఇలాంటి నివాళి కార్యక్రమాలు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్తారి ప్రభాకర్, పొన్నగంటి రాజయ్య, గుడిసెల అశోక్ రాజు, బత్తుల ప్రదీప్, సుద్దాల జగదీష్, ప్రవీణ్ కుమార్, నల్ల సురేష్, రుద్ర మనోహర్,  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు