ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు

13-11-2026 | 07:14pm

జగిత్యాల, నవంబర్ 13 ( విజయ క్రాంతి ): జన జాతీయ గౌరవ దివస్‌ను(Jatiya Gaurav Divas) పురస్కరించుకుని జగిత్యాల మండల రూరల్ పరిధిలోని ధర్మారం అంగన్‌వాడీ సెంటర్-1, జాబితాపూర్ అంగన్‌వాడీ సెంటర్-4(Jabitapur Anganwadi Centre) లలో పూర్వ బాల్య సంరక్షణ(Early Childhood Care) - విద్యా దినోత్సవం, సమాజ ఆధారిత కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో చిన్నారులు, తల్లులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలు అలాగే దేశ గొప్ప గిరిజన నాయకుల సేవల గురించి ఆటలు, పాటలు, కథలు, చిత్రలేఖనం ద్వారా సులభంగా అవగాహన కల్పించారు.

చిన్నారుల్లో చిన్ననాటి నుంచే మన దేశీయ సంస్కృతి పట్ల గౌరవభావం పెంపొందించేలా ఈ కార్యక్రమాలను రూపకల్పన చేశారు. అలాగే తల్లులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, సమాజ సభ్యుల భాగస్వామ్యంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఇందులో గిరిజనుల గొప్ప చరిత్ర, సాంప్రదాయ ఆహార పదార్థాలు, చిరుధాన్యాల ప్రాముఖ్యత, పౌష్టికాహారం, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, చిన్నారుల సంరక్షణపై విస్తృతంగా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమాల ద్వారా చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి, సమాజంలో ఆరోగ్యం, పోషకాహారంపై మంచి చైతన్యం వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ పవిత్ర, ధర్మారం అంగన్‌వాడీ సెంటర్-1 టీచర్ సరిత, జాబితాపూర్ అంగన్‌వాడీ సెంటర్-4 టీచర్ జమునలతో పాటు తల్లులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు