నీటి వృథాను అరికట్టేదెవరు?

13-11-2026 | 07:19pm
  1. ఓవైపు తాగునీటి కష్టాలు.. మరోవైపు రోడ్లపాలవుతున్న విలువైన నీరు
  2. నెలల తరబడి కొనసాగుతున్న పైపులైన్ లీకేజీ
  3. మరమ్మతులు చేపట్టని మున్సిపల్ యంత్రాంగం
  4. పట్టించుకోని అధికారులు.. ఇబ్బందులు పడుతున్న స్థానికులు
  5. బోడుప్పల్ డిప్యూటీ కమిషనర్ తక్షణమే స్పందించాలి

మేడిపల్లి, నవంబర్ 13 (విజ‌య‌క్రాంతి): ఒకవైపు ప్రజలు తాగునీటి(People drinking water) కోసం ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు విలువైన తాగునీరు(Drinking water) రోడ్లపాలవుతోంది. నీటి ప్రతి చుక్కను పొదుపు చేయాలని ప్రజలకు సూచించే అధికార యంత్రాంగం, తన పరిధిలో జరుగుతున్న నీటి వృథాను మాత్రం అరికట్టలేకపోతోంది. నెలల తరబడి పైపులైన్ లీకేజీ కొనసాగుతున్నా మరమ్మతులు చేపట్టకపోవడం మున్సిపల్ అధికారుల(Municipal officials) పనితీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌-10, పీర్జాదిగూడ  డివిజన్‌లో వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న పీర్జాదిగూడ కమాన్ వద్ద తాగునీటి పైపులైన్ లీకేజీ సమస్య స్థానికులకు ఇబ్బందిగా మారింది. పైపులైన్ నుంచి నీరు నిరంతరంగా బయటకు వచ్చి రోడ్డుపై ప్రవహిస్తూ వృథాగా పోతోంది. ఈ సమస్య నేటిది కాదు.. నెలల తరబడి ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నిబంధనలు ప్రజలకేనా?

ఇళ్ల వద్ద నీటిని వృథా చేస్తే జరిమానాలు విధించే అధికారులు, బహిరంగంగా పైపులైన్ల నుంచి వేల లీటర్ల నీరు వృథాగా పోతున్నా ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు నిబంధనలు అమలు చేయాల్సిన యంత్రాంగం, తన బాధ్యతను కూడా సమర్థంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు ఒక నిబంధన, అధికారుల నిర్లక్ష్యానికి మరో విధానం ఉండకూడదని పేర్కొంటున్నారు.

తాగునీటి కొరత ఉన్నా.. నీటి వృథా ఏమిటి?

ఇప్పటికే పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని సైతం సంరక్షించలేకపోవడం విచారకరం. పైపులైన్ లీకేజీలను గుర్తించి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. అయినప్పటికీ నెలల తరబడి సమస్య పరిష్కారం కాకపోవడం పర్యవేక్షణ లోపాలను స్పష్టం చేస్తోంది.

బోడుప్పల్ డిప్యూటీ కమిషనర్ ఈ సమస్యపై తక్షణమే స్పందించి, పీర్జాదిగూడ కమాన్ వద్ద పైపులైన్ లీకేజీకి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. సంబంధిత ఇంజినీరింగ్ సిబ్బందిని పంపించి మరమ్మతులు చేపట్టడంతోపాటు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు నీటి పొదుపుపై పాఠాలు చెప్పే అధికారులు ముందుగా తమ పరిధిలో నీటి వృథాను అరికట్టి ఆదర్శంగా నిలవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు