బావుసాయిపేటలో రూ.9 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

13-11-2026 | 07:14pm

ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో నిధుల మంజూరు.

కోనరావుపేట, నవంబర్ 13 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం(Konaraopeta Mandal) బావుసాయిపేట గ్రామంలో ప్రజల రాకపోకలకు, రవాణా సౌకర్యాలకు ఇబ్బందులు కలగకుండా నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను(CC road construction work) ప్రారంభించారు.ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Adi Srinivas) ప్రత్యేక చొరవతో మంజూరైన రూ.9 లక్షల సీఆర్ఆర్ నిధులతో(CRR funds) చేపట్టనున్న ఈ పనులను గ్రామ సర్పంచ్ షేక్ యాస్మిన్ ఫిరోజ్ పాషా పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు, ముఖ్యంగా అంతర్గత రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గతంలో రహదారి సరిగా లేక వర్షాకాలంలో బురదమయంగా మారి గ్రామస్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామస్థుల చిరకాల సమస్యను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి రూ.9 లక్షల నిధులు మంజూరు చేయించారని కృతజ్ఞతలు తెలిపారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గుత్తేదారులను కోరారు.ఎమ్మెల్యే సహకారంతో భవిష్యత్తులోనూ బావుసాయిపేట గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మారుపాక సునీత, దువ్వల అక్షయ్, ఆరే సుజాత, ఊరడి రమేష్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి రాధిక, స్థానిక నాయకులు, గ్రామస్థులు నేరెళ్ల దేవయ్య, బొడ్డు దేవయ్య, జంగం సంజీవ్, దినాకర్, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు