రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి

05-11-2026 | 07:59pm

రీ-సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలి – కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి (రేగొండ), నవంబర్ 05 (విజయ క్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో రబీ సీజన్‌లో(Rabi season) నీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను రైతులు(Farmers) ఎంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) సూచించారు. గురువారం క్షేత్రస్థాయిలో రైతులను కలసి వ్యవసాయ బోర్లు, సాగునీటి వనరుల పరిస్థితిని పరిశీలించారు.

అందుబాటులో ఉన్న నీటి వనరులను అంచనా వేసిన తర్వాతే పంటల సాగు చేపట్టాలని, స్వల్పకాలిక పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఫామ్‌ పాండ్స్, పర్కొలేషన్‌ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

భూ హద్దులపై స్పష్టత ఉండాలి

రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను కలెక్టర్ తనిఖీ చేసి, భూ హద్దుల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు, వివాదాలు తలెత్తకుండా ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఇప్పటివరకు సుమారు 443 ఎకరాల రీ-సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

రైతుల అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని, సర్వే అనంతరం నోటీసులు జారీ చేసి 60 రోజులపాటు అప్పీల్‌కు అవకాశం కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. చెరువులు, పంట కాలువల ఆక్రమణలపై కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, తాసిల్దార్ శ్వేత సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు