ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి పొంచి ఉంది

05-11-2026 | 07:52pm

ముందస్తు జాగ్రత్తలతోనే నీటి సమస్యకు పరిష్కారం

అక్రమ నిర్మాణాలపై కొరడా... వార్డులవారీగా సమస్యల గుర్తింపు

65 అంశాలపై సమావేశంలో సమీక్ష

బాన్సువాడ పురపాలక సంఘం చైర్ పర్సన్ కాసుల విజయ బాలరాజ్

బాన్సువాడ,(విజయక్రాంతి): రానున్న కాలంలో ఎల్‌నినో  ప్రభావం(El Nino Impact)తో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ పురపాలక సంఘం చైర్ పర్సన్ కాసుల విజయ బాలరాజ్(Banswada Municipal Chairperson Kasula Vijaya Balaraj) సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని  పురపాలక సంఘం కార్యాలయంలో గురువారం చైర్ పర్సన్ కాసుల విజయ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నీటి వనరుల పరిరక్షణ(Conservation of Water Resources), తాగునీటి పొదుపు, వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం కారణంగా వాతావరణంలో మార్పులు సంభవించి వర్షపాతం తగ్గడం లేదా ఆలస్యమయ్యే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు.

దీనివల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గోపి గంగాధర్, వైస్ చైర్‌పర్సన్ రేష్మ బేగం ఎజాజ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఆయా శాఖల అధికారులు, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలి

వ్యవసాయ రంగంలో రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. పంటల సాగులో నీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగయ్యే పంటలపై దృష్టి సారించాలని తెలిపారు. సాధ్యమైనంత వరకు బిందు, తుంపర సేద్యం వంటి ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని సూచించారు. పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని పేర్కొన్నారు.

తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి

పట్టణ పరిధిలోని వివిధ వార్డుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నీటి నిల్వలు, సరఫరా మార్గాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

పాఠశాలలు, ఆసుపత్రులకు సూచనలు

పట్టణంలోని పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థల్లో నీటి వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

65 అంశాలపై సమీక్ష..

బాన్సువాడ పట్టణ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. పట్టణ అభివృద్ధికి సంబంధించి గుర్తించిన 65 అంశాలపై సమీక్షించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.

అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు

పట్టణ పరిధిలో సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందకుండా చేపడుతున్న భవన నిర్మాణాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు ఏర్పాటు చేయకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ప్రభుత్వ నిబంధనలు, మున్సిపల్ చట్టాలకు అనుగుణంగానే నిర్మాణాలు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు