బీఎస్ఎఫ్ జవాన్ వంగరి రాజేష్‌కు ఘన సన్మానం
వరంగల్,(విజయక్రాంతి): దేశ సరిహద్దుల్లో(Nation borders) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్‌గా గత 25 సంవత్సరాలుగా విశేష సేవలందిస్తూ, దేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన కాశిబుగ్గ నివాసి వంగరి రాజేష్(BSF Jawan Rajesh)ను గురువారం ఘనంగా సన్మానించారు. దేశ భద్రత కోసం తన జీవితంలోని పాతికేళ్లను అంకితం చేసిన రాజేష్ అద్వితీయ దేశభక్తిని, సేవలను గుర్తిస్తూ బీజేపీ ఎండోమెంట్ ధార్మిక సెల్ వరంగల్ జిల్లా కమిటీ(BJP Endowment & Religious Affairs Cell – Warangal District Committee) ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.
వరంగల్ నగరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సదస్సులో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై, జవాన్ వంగరి రాజేష్ ను శాలువా, మెమొంటోతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ, మనందరికీ రక్షణ కల్పిస్తున్న సైనికులను గౌరవించడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని కొనియాడారు.
రాజేష్ లాంటి జవాన్ల త్యాగాలు, నిరంతర సేవలు నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. దేశం కోసం సేవలందించి తిరిగొచ్చిన జవాన్‌ను గౌరవించుకోవడం తమ కమిటీకి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ధార్మిక జిల్లా కన్వీనర్ మడిపల్లి నాగరాజు గౌడ్, హనుమంతు శర్మ, డాక్టర్ కొంతం కృష్ణ, భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శివరామకృష్ణ గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎర్రోగొల్ల భరత్ వీర్ పాల్గొన్నారు.