అగ్రీగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేవరకు విశ్రమించం
- సంస్థ ఆస్తులమ్మి బాధితులకు చెల్లింపులు చేపట్టాలి
- బినామీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెంటౌన్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : అగ్రీగోల్డ్ బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగేంతవరకు ఉద్యమ పోరాటాలు కొనసాగిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kothagudem MLA Kunamneni Sambasiva Rao) స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయం శేషగిరిభవన్ లో గురువారం జిల్లాస్థాయి అగ్రీగోల్డ్ బాధితుల విస్తృత సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రెక్కాడితేగానీ డొక్కాడని చిరువ్యాపారులు, రైతులు, పేదలు తమ కష్టార్జితాన్ని పొదుపు చేసుకుంటే ఆ సంస్థ నిలువునా మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏళ్లు గడుస్తున్నా బాధితులకు చిల్లిగవ్వ అందకపోవడం దుర్మార్గమని విమర్శించారు.
లక్షలాది మంది పేద కుటుంబాలు, ఏజెంట్లు రోడ్డున పడి తీవ్ర మానసిక క్షోభతో ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వాలు చోద్యం చూడడం భావ్యం కాదన్నారు. సంస్థకు సంబంధించిన వేల కోట్ల విలువైన ఆస్తులను వెంటనే వేలం వేసి బాధితులకు సత్వరమే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితుల సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో అగ్రీగోల్డ్ యాజమాన్యం బినామీ పేర్లతో దాచిపెట్టిన సమస్త ఆస్తులను గుర్తించి తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అగ్రీగోల్డ్ కంపెనీ మోసాలను తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడిన బాధితులు, ఏజెంట్ల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
బాధితుల పక్షాన అసెంబ్లీలో గళమెత్తడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి న్యాయం దక్కేలా ఉద్యమిస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.