భూ తగాదాల పరిష్కారానికే రీ సర్వే

03-11-2026 | 06:56pm

పారదర్శకంగా నిర్వహించాలి..

రైతులు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలి

అలంపూర్, నవంబర్‌ 3: భూ తగాదాల పరిష్కారంతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రీ సర్వే చేపడుతోందని జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌(District Collector Rizwan Basha Sheikh) అన్నారు. మంగళవారం మానవపాడు మండలం జల్లాపురం శివారులో నిర్వహిస్తున్న రీ సర్వే పనులను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. రైతుల పొలాల హద్దుల నిర్ధారణలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా, ఇరుపక్షాల సమక్షంలో నిబంధనల ప్రకారం పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం రైతులతో మాట్లాడిన కలెక్టర్‌.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నందున రబీ సీజన్‌లో ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున సాగునీరు విడుదల చేసే అవకాశం లేదని, బోర్లు, బావుల్లో నీటి లభ్యత ఆధారంగానే పంటలు సాగు చేయాలని స్పష్టం చేశారు. నీటి వసతి లేని రైతులు పంటల సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జల సంరక్షణ పనులు, పంట కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నందిని, సర్వే ఏడీ నూకరాజు, తహసీల్దార్‌ మన్సూర్‌ అలీ సిద్ధిఖీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు