ముంపు భూములకు పరిహారానికి సిద్ధం!

03-11-2026 | 06:45pm

హైదరాబాద్: తుమ్మిడిహట్టి బ్యారేజీ(Thummidihatti Barrage Project) నిర్మాణ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల వివరాలు, గతంలో కుదిరిన ఒప్పందాలు, ఇతర కీలక పత్రాలతో చర్చలకు సిద్ధం కావాలని సూచించారు.

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy )తో కలిసి సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర ప్రతినిధులతో ఇటీవల జరిగిన చర్చల పురోగతి, ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు.

ప్రాజెక్టు నిర్మాణం వల్ల మహారాష్ట్ర(Maharashtra) పరిధిలో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిహారం మొత్తాన్ని రెండు రాష్ట్రాల ఉమ్మడి ఖాతాలో జమ చేసేందుకు కూడా ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు.

ముంపు భూములపై మహారాష్ట్ర ప్రభుత్వం స్వయంగా సర్వే నిర్వహించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. సర్వేకు అవసరమైన సమాచారం, సాంకేతిక వివరాలను అక్కడి అధికారులకు ఎప్పటికప్పుడు అందించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ(Telangana Irrigation Department)కు సూచించారు.

తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించి గతంలో జరిగిన ఒప్పందాలు, చర్చల వివరాలు, ముంపు ప్రాంతాల సమగ్ర సమాచారం ఒకచోట సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన పత్రాలను అందజేస్తూ చర్చలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, ముంపు భూములకు పరిహారం వంటి అంశాలపై తెలంగాణ ప్రభుత్వం సానుకూల ప్రతిపాదనలు ముందుకు తీసుకురావడం ప్రాజెక్టు భవిష్యత్తుపై ఆసక్తిని పెంచింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు, తదుపరి నిర్ణయాలు, అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే నిర్మాణానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు