సీసీటీవీ కెమెరాల ప్రారంభం...
- ఏంద గ్రామంలో, లింగోజి తాండ ఉట్నూర్ ఎక్స్ రోడ్డు
- నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల పాత్ర కీలకం..
- విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
- గ్రామ ప్రజల చొరవ అభినందనీయం.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..
ఉట్నూర్, నవంబర్03 ( విజయక్రాంతి ): ఏంద గ్రామంలో మరియు లింగోజి తాండ ఉట్నూర్ ఎక్స్ రోడ్ నందు గ్రామ(Nandu Village) ప్రజల సహకారంతో ఏర్పాటు చేసిన 15 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(District SP Akhil Mahajan) మంగళవారం సాయంకాలం ప్రారంభించారు. ఏందా గ్రామంలో 9, లింగోజి తాండ ఎక్స్ రోడ్డు లో ఆరు సీసీటీవీ కెమెరాలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నివారణలో సీసీటీవీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. గ్రామ ప్రజలు ఉన్నతంగా ఆలోచించి గ్రామ భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రత్యేకంగా ప్రశంసించారు.
పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... చదువు అనే ఆయుధంతో ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని, విద్య ఒక్కటే ఉజ్వల భవిష్యత్తుకు మార్గమని తెలిపారు. ప్రతిరోజూ కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. ప్రతి విద్యార్థికి ఒక హాబీ ఉండాలని, హాబీల ద్వారా ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెరుగుతాయని పేర్కొన్నారు. చదువుతో పాటు శారీరక వ్యాయామం, ఆటల్లో కూడా విద్యార్థులు పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కొట్టే,ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్, ఏందా గ్రామ సర్పంచ్ కిరణ్ కుమార్ రాథోడ్, లింగోజి తాండ సర్పంచ్ మాయ హరినాయక్, పాఠశాల విద్యార్థులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.