ఆదాయం పెంచే ఆరు మార్గాలు

03-11-2026 | 06:53pm

హైదరాబాద్: వ్యవసాయం(Agriculture) అంటే కేవలం పంటలు పండించి మార్కెట్‌లో అమ్మడమే కాదు.. ఒకే భూమి నుంచి వివిధ మార్గాల్లో ఆదాయం పొందేలా ప్రణాళిక వేసుకోవచ్చని నిరూపిస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ సైనికుడు మేజర్ సీహెచ్ నవీన్ కుమార్(Former Army Major Naveen Kumar). వడపల్లికి చెందిన ఆయన 15 ఎకరాల్లో సేంద్రియ సాగుతో పాటు పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఉద్యానవనం, జీవ ఉత్పాదక ఉత్పత్తులను సమన్వయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన వ్యవసాయ ప్రయాణం 'రైతు నేస్తం'(Rythu Nestham) 113వ ఎపిసోడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఒకే పంటపై ఆధారపడకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను కలిపి నిర్వహిస్తే రైతులకు ఆదాయ భద్రత పెరుగుతుందని నవీన్ కుమార్ తన అనుభవంతో చాటిచెబుతున్నారు. పంటల సాగుతో పాటు పశుపోషణ, కోళ్ల పెంపకం, మత్స్య సంపద, ఉద్యాన పంటలు, జీవ ఉత్పత్తుల తయారీని ఒకే వ్యవసాయ నమూనాలో భాగం చేసుకున్నారు. ఈ విధానం చిన్న, సన్నకారు రైతులకు కూడా అనుసరించదగిన మార్గమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) పేర్కొన్నారు.

రైతులు తమ భూమి విస్తీర్ణం, నీటి లభ్యత, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని మంత్రి సూచించారు. పంటల వైవిధ్యీకరణతో పాటు అనుబంధ రంగాలను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయంపై వచ్చే ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని వివరించారు. రోజువారీ, వారపు, కాలానుగుణ ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకోవడం సమీకృత వ్యవసాయంలో కీలకమని పేర్కొన్నారు.

రాబోయే ఎల్‌నినో పరిస్థితుల(El Nino conditions) నేపథ్యంలో రైతులు నీటి వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తుమ్మల సూచించారు. వచ్చే యాసంగి సీజన్‌లో నీటి పొదుపు పద్ధతులు, సూక్ష్మ నీటిపారుదల విధానాలను విస్తృతంగా వినియోగించాలని కోరారు. తక్కువ నీటితో సాగు సాధ్యమయ్యే చిరుధాన్యాలు, పశుగ్రాస పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

మురసు తుఫాను ప్రభావం నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను గమనిస్తూ పంట కోత పనులను తాత్కాలికంగా వాయిదా వేయాలని మంత్రి రైతులకు సూచించారు. అనవసరమైన పంట నష్టాన్ని నివారించేందుకు వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలని కోరారు. పురుగుమందుల వినియోగంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని, తగిన రక్షణ పరికరాలు ధరించాలని, క్షేత్రస్థాయిలో రైతులకు మరింత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

వాతావరణ మార్పులు, సాగునీటి సమస్యలు, మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కోవాలంటే వ్యవసాయంలో కొత్త పద్ధతులను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. సమీకృత వ్యవసాయం ద్వారా రైతుల ఆదాయాన్ని విస్తరించడంతో పాటు పర్యావరణానికి అనుకూలమైన సాగు విధానాలను ప్రోత్సహించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రిటీఎస్ డైరెక్టర్ బి. గోపి, ఐఏఎస్, ఏపీసీ సురేంద్ర మోహన్, ఐఏఎస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు