క్రీడలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి
70వ రాష్ట్రస్థాయి హాకీ పోటీ లు ప్రారంభం
కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి): క్రీడలతో విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అలవాడతాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బీబీపేటలోని తిమ్మయ్య గారి సుశీల నారాయణరెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 70వ రాష్ట్రస్థాయి హాకీ పోటీలు కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(District Collector Ashish Sangwan) ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులతో మమేకమై పోటీల నిర్వహణ, పాల్గొంటున్న జట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పది జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులతో మాట్లాడి వారిని ప్రోత్సహించారు. క్రీడా మైదానంలో క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థులను వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ఆసక్తి కనబరచాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసానికి, క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే తత్వం, నాయకత్వ లక్షణాల పెంపునకు దోహదపడతాయని తెలిపారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని అన్నారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించడం గొప్ప విషయమని, ప్రతి క్రీడాకారుడు తన ప్రతిభను ప్రదర్శించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్, ఉపాధ్యాయులు, క్రీడా నిర్వాహకులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.